1 John 2

క్రీస్తు మనకోసం విజ్ఞాపన చేస్తూ ఉండడం వల్ల సహవాసం కొనసాగుతున్నది

1నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పాలిట న్యాయవాది, నీతిమంతుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు. 2మన పాపాలకు మాత్రమే కాకుండా, సర్వలోక పాపాలకూ ఆయనే పరిహారం.

సహవాసం గురుతులు- విధేయత, ప్రేమ

3ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగినవారం అని మనకు తెలుస్తుంది.

4“నాకు దేవుడు తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించనివాడు అబద్ధికుడు. 5కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది 6ఆయనలో ఉన్నానని చెప్పేవాడు, యేసు క్రీస్తు ఎలా నడుచుకోన్నాడో, అలాగే నడుచుకోవాలి.

7ప్రియులారా, నేను మీకు రాస్తున్నది కొత్త ఆజ్ఞ కాదు. ఇది ఆరంభం నుంచీ మీకు ఉన్న పాత ఆజ్ఞే. ఈ పాత ఆజ్ఞ, మీరు విన్న వాక్కే. 8అయినా, మీకు కొత్త ఆజ్ఞ రాస్తున్నాను. క్రీస్తులోనూ, మీలోనూ ఇది నిజమే. ఎందుకంటే చీకటి వెళ్ళిపోతూ ఉంది. నిజమైన వెలుగు ఇప్పటికే ప్రకాశిస్తూ ఉంది.

9తాను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, తన సోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు. 10తన సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. అతను తడబడి పడిపోయే అవకాశం లేదు. 11కాని తన సోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. చీకట్లోనే నడుస్తూ ఉన్నాడు. చీకటి అతణ్ణి గుడ్డివానిగా చేసింది కాబట్టి అతడు ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు.

12ప్రియమైన చిన్నపిల్లలారా! ఆయన నామంలో మీ పాపాలకు క్షమాపణ దొరికింది కాబట్టి మీకు రాస్తున్నాను. 13తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు సైతానుని ఓడించారు కాబట్టి మీకు రాస్తున్నాను. 14చిన్నపిల్లల్లారా, మీరు తండ్రిని తెలుసుకొని ఉన్నారు కాబట్టి మీకు రాస్తున్నాను. తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు బలవంతులు, దేవుని వాక్కు మీలో నిలిచి ఉంది, మీరు సైతానుని ఓడించారు, అందుకే మీకు రాస్తున్నాను.

దేవుని పిల్లలు ఈ లోకాన్ని ప్రేమించ కూడదు

15ఈ లోకాన్నిగానీ, ఈ లోకంలో ఉన్నవాటినిగానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే. 16ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఇంకా ఈ జీవిత దురహంకారం, ఇవి తండ్రి సంబంధమైనవి కాదు. 17ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయిగాని దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు.

క్రీస్తు దైవత్వాన్ని ప్రశ్నించే వారి విషయం జాగ్రత్తగా ఉండాలి

18పిల్లలూ, ఇది చివరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తున్నాడని మీరు విన్నారు కదా, అయితే, ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు వచ్చారు. దీన్నిబట్టి ఇది ఆఖరి ఘడియ అని మనకు తెలుస్తూ ఉంది. 19వాళ్ళు మన దగ్గరనుండి వెళ్ళారు గాని మనవాళ్ళు కాదు. మనవాళ్ళే అయితే మనతోనే ఉండిపోయేవాళ్ళు. బయటకు వెళ్ళిపోవడం ద్వారా వాళ్ళు మనకు సంబంధించినవాళ్ళు కాదని కనబడుతూ ఉంది.

20కాని, మీకు పవిత్రుని అభిషేకం ఉంది. అందుచేత మీ అందరికీ సత్యం తెలుసు. 21మీకు సత్యం తెలియదు అనే ఉద్దేశంతో నేను మీకు రాయలేదు. సత్యం మీకు తెలుసు. సత్యంనుండి ఏ అబద్ధమూ రాదు కాబట్టి మీకు రాస్తున్నాను.

22యేసే క్రీస్తు అని అంగీకరించనివాడే అబద్ధికుడు. తండ్రిని, కుమారుణ్ణి నిరాకరించినవాడే క్రీస్తు విరోధి. 23కుమారుణ్ణి నిరాకరించిన ప్రతివాడికీ తండ్రి లేనట్టే. కుమారుణ్ణి అంగీకరించిన వాడికి తండ్రి ఉన్నట్టే.

24మీరైతే, మొదటినుండీ ఏది విన్నారో అది మీలో నిలిచిపోయేలా చూసుకోండి. మొదటినుండీ విన్నది అలాగే నిలిచి ఉంటే, మీరు కుమారునిలో, తండ్రిలో నిలిచి ఉంటారు. 25ఆయన మనకు శాశ్వత జీవాన్ని వాగ్దానం చేసాడు. 26ఇవన్నీ, మిమ్మల్ని తప్పు దారి పట్టించే వాళ్ళని గురించి రాశాను.

27ఇక మీ విషయంలో, ఆయన నుండి అందుకున్న అభిషేకం మీలో నిలిచి ఉంది కాబట్టి, ఎవ్వరూ మీకు ఉపదేశం చెయ్యవలసిన అవసరం లేదు. ఆయన అభిషేకం అన్నిటిని గూర్చి మీకు ఉపదేశం చేస్తుంది. ఆ అభిషేకం సత్యం. అది అబద్ధం కాదు. అది మీకు ఉపదేశం చేసిన విధంగా మీరు ఆయనలో నిలిచి ఉండండి 28కాబట్టి పిల్లలూ, ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షం అయినప్పుడు, ఆయన ముందు సిగ్గుపాలు కాకుండా ధైర్యంతో నిలబడగలిగేలా ఆయనలో నిలిచి ఉండండి.

చిన్నపిల్లలు ఒకరినొకరు ఎలా గుర్తిస్తారు?

ఆయన నీతిమంతుడు అని మీకు తెలుసు కాబట్టి, నీతిని అనుసరించే వాళ్ళందరూ ఆయన వల్ల పుట్టినవారని కూడా మీకు తెలుసు.

29

Copyright information for TelULB